రాష్ట్ర పండగగా రాజాం పైడితల్లి జాతర
● ఈనెల 22 నుంచి ఉత్సవాలు
రాజాం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, రాజాంలోని పోలిపల్లి పైడితల్లి జాతరను రాష్ట్రస్థాయి పండగగా గుర్తిస్తూ దేవదాయ శాఖ బుధవారం జీఓ జారీ చేసింది. జాతర ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జరిపేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం రూ.50లక్షల నిధులను కేటాయించారు. మూడురోజులు పాటు ఆలయం వద్ద ఉచిత ప్రసాదం, అన్నదానం, విద్యుత్ అలంకరణ, సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పండగగా గుర్తించడంతో భక్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆలయానికి 2023లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6ఏ హోదా కల్పించడంతో ఆ స్థాయిలో జాతరకు అప్పట్లో ఏర్పాట్లు చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే శతవసంతాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, అమ్మవారి దర్శనానికి సుమారు 50వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు ఆలయ ఈఓ బి.వి.మాధవరావు తెలిపారు.


