వరాల వసంతం.. రంజాన్
● నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
● నెలరోజులు కఠోర దీక్షలు, దానధర్మాలు
● పాపాల నుంచి రక్షించుకునే అవకాశం
నెలవంక
విజయనగరం టౌన్ :
యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్రమైన, సంతోషాలు పంచే నెల రంజాన్. ఈనెల అరబ్ నెలల వరుస క్రమంలో 9వ నెలగా గుర్తించబడుతుంది. భారతదేశంలో బుధవారం రాత్రి చంద్రుడు కనిపించడంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం నుంచి నెలరోజుల పాటు ఉపవాస దీక్షలకు ముస్లిం సోదరులు నాంది పలికారు. మసీదులు, ఈద్‌గాలను ముస్తాబు చేస్తున్నారు.
ఎంతో ప్రత్యేకత..
రంజాన్ అంటే ‘కాలిపోవడం, భస్మీపటలమవ్వడం, ఆగిపోవడం’ అనే అర్థాలను సూచిస్తుంది. ఈ నెలలో ప్రతి ముస్లిం పుణ్యఫలాలు పొందేందుకు ఉపవాస దీక్షలు చేస్తారు. నెలవంకను చూసిన వెంటనే ప్రారంభమైన ఈ నెలకు అల్లాహ్ దృష్టిలో పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానముంది. సంతోషాలు, పుణ్యాలను అందిస్తుందని నమ్ముతారు.
పాపాల నుంచి రక్షించుకునే అవకాశం
మనిషి తాను చేసిన పాపాల నుంచి రక్షించుకునే అవకాశం భగవంతుడు కల్పించాడు. ఖురాన్ పఠనంతో ప్రతీ ముస్లింలో వ్యక్తిత్వ వికాసం జనిస్తుంది. రంజాన్ నెల సహన గుణం నేర్పే నెల. ఈ నెల మిగతా 11 నెలలకు ఒక శిక్షణ కాలం వంటిది. ఈ నెలలో లభించిన సుగుణాలు మిగిలిన నెలల్లో వికసించేలా ముస్లిం సోదరులు చూస్తారు. – మహ్మద్ హబీబ్,
జమాతే ఇస్లామీ హింద్, విజయనగరం
ప్రత్యేక అలంకరణలో మూడులాంతర్లు వద్దనున్న జామియా మసీదు
ఈ నెల ప్రత్యేకతలు
30 రోజుల పాటు ప్రపంచంలో ముస్లింలందరూ ఉపవాస దీక్షలు పాటిస్తారు.
మానవుల మార్గదర్శక గ్రంథం, చివరి దైవ గ్రంథం దివ్యఖురాన్ అవతరించింది ఈ నెలలోనే. దీనికి కృతజ్ఞతగానే ముస్లింలు ఉపవాసాలు పాటిస్తారు.
ఈ నెలలో చేసే ప్రతీ చిన్న పుణ్యకార్యానికి 70 నుంచి 700 రెట్ల పుణ్యం లభిస్తుంది.
దైవత్వం ఈ నెలలో నరక ద్వారాలను మూసివేయిస్తారని, స్వర్గధ్వారాలను తెరిచి ఉంచుతారని, సైతానులను బందిస్తారని నమ్మకం.
పేదలకు, అవసరార్థులకు, వితంతువులకు, అనాథలకు, బాటసారులకు ఎక్కువగా సాయం, ధాతృత్వం చూపబడుతుంది. సంపద వృద్ధి చెందుతుంది.
వరాల వసంతం.. రంజాన్
వరాల వసంతం.. రంజాన్


