అడిగింది రూ.559.09 కోట్లు ఇచ్చింది రూ.115.81 కోట్లు
● సాగునీటి ప్రాజెక్టులకు అరకొర నిధులు
● నిధులు తేలేకపోయిన పాలకులు
● ఇలాగైతే ప్రాజెక్టులు పూర్తి కష్టమే
విజయనగరం కలెక్టరేట్: కూటమి ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. కీలక ప్రాజెక్టులైన తోటపల్లి, తారకరామ తీర్థసాగర్‌కు నిధుల కేటాయింపులో కోతవేసింది. అధికారులు అడిగిన నిధుల్లో సగం కూడా ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఇలా అయితే 20శాతం పనులు కూడా పూర్తికావంటున్నారు.
తోటపల్లి ప్రాజెక్టు... విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా రైతులకు సాగునీటి ఆదరువు. 1,31,221టీఎంసీల సాగునీరు, 320 టీఎంసీల తాగునీరు, 64 టీఎంసీల నీరు పరిశ్రమలకు అందించడం ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్టు 90శాతం పనులు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ హయాంలో పూర్తయ్యాయి. మిగిలిన పదిశాతం పనులు పూర్తిచేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విదల్చకపోవడాన్ని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక 24వేల ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందించేందుకు నిర్మాణంలో ఉన్న మరో ప్రాజెక్టు తారకరామ తీర్థసాగర్. 35 శాతం పనులు పూర్తికాగా భూసేకరణ జరిగింది.
ప్రాజెక్టులను బట్టి..
రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల పరిస్థితిని బట్టి నిధులు కేటాయించారు. గతేడాది, అంతకుముందు సంవత్సరం కేటాయింపు, ఖర్చు ఆధారంగా ఇచ్చారు. ఆ విధంగా రెండు ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు జరిగింది. నిధులు కేటాయింపు మేరకు పనులు చేపడతాం. – స్వర్ణకుమార్, ఎస్‌ఈ, టీటీపీఆర్
మూడేళ్లగా నిర్లక్ష్యమే
జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మూడు బడ్జెట్‌లలో సరిగ్గా నిధులు ఇవ్వలేదు. పనులు ముందుకు సాగడంలేదు.
– అట్టాడ కృష్ణ, కొల్లాం, డెంకాడ మండలం
అధికారులు ప్రతిపాదన, ప్రభుత్వం కేటాయింపు తీరు ఇలా...
తోటపల్లి ప్రాజెక్టు సర్కిల్ పరిధిలోని పనులకు రూ.110కోట్లు, భూ సేకరణకు రూ.3 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.106.81కోట్లు, ఇతర పనులకు రూ.1.71కోట్లు, సీఈ నుంచి రూ.256.20కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం కేవలం రూ.47.81కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. తారకరామ ప్రాజెక్టు పనులకు సర్కిల్ అధికారులు రూ.127.20కోట్లు, భూసేకరణకు రూ.32కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌కు 168.75 కోట్లు కలిపి రూ.327.95 కోట్లు అడగ్గా కేవలం రూ.68కోట్లు ఇవ్వడం విశేషం. ఈ లెక్కలు చూస్తే రెండు ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడంలేదని రైతులు చెబుతున్నారు.
అడిగింది రూ.559.09 కోట్లు ఇచ్చింది రూ.115.81 కోట్లు


