అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయండి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్: ప్రతీ నియోజకవర్గంలో ప్రధాన అంశాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి అంశాలు, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, రెవెన్యూ, రీసర్వే తదితర అంశాలపై తన చాంబర్లో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చేనెల 4న జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారని, జిల్లా చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో చర్చించేందుకు ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమైన మూడు అంశాలను గుర్తించి అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఇ.మురళి, సీపీఓ పి.బాలాజీ పాల్గొన్నారు.
ఆస్పత్రి వ్యర్థాలను ప్రతిరోజూ తరలించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలన్నీ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందికరంలో వైద్య ఆరోగ్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఆస్పత్రిలో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులను ఉపయోగించి సూదులు, పత్తి, గ్లౌజ్‌లు, ఇతర వ్యర్థాలను వేరుచేయాలన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పశు సంవర్థక ఆస్పత్రుల్లో చెత్తసేకరణ జరగాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, తదితరులు పాల్గొన్నారు.


