ఫ్లెక్సీ తెచ్చిన రగడ
గంట్యాడ: మండలంలోని ఓ గ్రామ దేవత జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి తెరలేపింది. జిల్లాకు చెందిన మంత్రి సొంత నియోజకవర్గంలో ఆయన ఫొటో లేకుండా గంట్యాడ మండల కేంద్రంలో పెట్టిన ప్రచార ఫ్లెక్సీ చిచ్చు రేపింది. అది గమనించిన మంత్రి అనుయాయులు వాటిని చింపివేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గంట్యాడ మండలంలోని కొత్తపాలెం గ్రామంలో గ్రామ దేవత కృష్ణమ్మ పేరంటాలు జాతర మహోత్సవాన్ని ఈ నెల 15న నిర్వహించారు. ఇందులో భాగంగా బొండపల్లికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు గంట్యాడ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫొటో లేకుండా.. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఫొటోతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్.మాధవ్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయిన, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తదితర ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో మంత్రి ఫొటో లేకపోవటంతో ఈ రాద్ధాంతం చోటు చేసుకుందని, సొంత మండలంలోనే మంత్రికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
● మంత్రి ఫొటో లేకుండా ఎలా ఫ్లెక్సీ వేస్తారు...?
● చింపేసిన మంత్రి అనుయాయులు


