గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 4:16 PM

లక్కవరపుకోట : అరకు – విశాఖపట్నం జాతీయ రహదారిలో మల్లివీడు రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం రాత్రి కుక్క అడ్డంగా వచ్చి మండలంలోని రెల్లిగౌరమ్మపేట గ్రామానికి చెందిన ఏడువాక శ్రీనివాస్‌(27) తన బైక్‌తో బోల్తా పడి.. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ నవీన్‌పడాల్‌, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. శ్రీనివాస్‌ తన సొంత పని మీద మంగళవారం సాయంత్రం కొత్తవలస వెళ్లి తిరుగు ప్రయాణంలో మల్లివీడు జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో బోల్తా పడ్డాడు. దీంతో శ్రీనివాస్‌ రహదారి పక్కనే పంట పొలాల్లోకి తుళ్లి పడ్డాడు. దీంతో కాళ్లు, చేతులు విరిగి తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు గుర్తించి మృతుడి వద్ద గల ఫోన్‌లో గల కుటుంబ సభ్యుల నంబరుకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనంలో క్షతగాత్రుడిని ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య రమ్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్‌ తన స్వగ్రామానికి సమీపంలో గల ఒక ప్రైవేటు కర్మాగారంలో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శ్రీనివాస్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి భార్య రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ తెలిపారు.

వందేభారత్‌ రైలు ఢీకొని వ్యక్తి..

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని నర్సిపురం – మరిపివలస మధ్య రైలు పట్టాలు దాటుతుండగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణరాయపురం (నీలకంఠాపురం) గ్రామానికి చెందిన ఉరిటి ఆదినారాయణ (50) రైల్వే ట్రాక్‌ సమీపంలోని పొలంలో మినప చేను పనుల్లో నిమగ్నమయ్యారు. వెంట తెచ్చుకున్న తాగునీరు అయిపోవడంతో, నీటి కోసం పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదినారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే హెచ్‌సీ రత్నకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement