ప్రతిభ చూపండి.. పతకం అందుకోండి
విజయనగరం: వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ప్రతినెలా నిర్వహించే క్రీడా పోటీలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈనెల 17 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు పోటీలు నిర్వహించేలా ప్రణాళికను విడుదల చేసింది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయా క్రీడాంశాల్లో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనుంది. జిల్లా వేదికగా రెండు క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనుంది.
మొదలైన క్రీడాకారుల ఎంపిక పోటీలు
జిల్లాలో నిర్వహించే పోటీల్లో ప్రథమంగా 17న చెస్, 24న సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో మంగళవారం అండర్–13, 15, 17, 19 లోపు వయస్సుగల బాల, బాలికలకు నిర్వహించిన పోటీల్లో మొత్తంగా 210 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆయా వయస్సుల విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఇరువురు బాలురు, బాలికలతో పాటు మొత్తంగా 16 మంది క్రీడాకారులను చెస్ క్రీడాంశంలో ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 21, 22న తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 24న నగర శివారుల్లో గల విజ్జి స్టేడియంలో సైక్లింగ్ క్రీడాంశంలో ఓపెన్ విభాగంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
శాప్ ఆధ్వర్యంలో జరగనున్న పోటీలు
వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, హ్యాండ్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, బీచ్ హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బీచ్ ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్, ఆర్చరీ, జూడో, జిమ్నాస్టిక్స్, హాకీ, బీచ్ కబడ్డీ, రైఫిల్ షూటింగ్,, పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్, స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి...
శాప్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన లీగ్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ముందుగా తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. శాప్ రూపొందించిన క్రీడా యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉంటుంది. పూర్తి పారదర్శకంగా నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు తగిన గుర్తింపు ఉంటుంది. – ఎస్.వెంకటేశ్వరరావు,
డీఎస్‌డీఓ, విజయనగరం
ప్రతినెలా శాప్ ఆధ్వర్యంలో లీగ్ టోర్నమెంట్‌లు
జిల్లా స్థాయి చెస్ క్రీడాకారుల
ఎంపికలకు 210 మంది హాజరు
రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత
సాధించిన 16 మంది క్రీడాకారులు


