స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం
● రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం
పాలకొండ: పట్టణంలోని రాజాం రహదారిలో నిర్వహిస్తున్న చెత్త సేకరణ షాపులో (స్క్రాప్ షాపు) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ కొంతకాలంగా వ్యర్థ ప్లాసిక్ట్‌తో ముడిసరుకు తయారుచేస్తున్నారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున మంటలు పెద్దెత్తున చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనలతో పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. పాలకొండ, వీరఘట్టం, రేగిడి, రాజాం మండలాలకు చెందిన అగ్నిమాపక వాహనాల ద్వారా 50 మంది అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రెండు ట్రాలీ వాహనాలతో పాటు సరుకు కాలిపోవడంతో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని బెవర మణికంఠ తెలిపారు. జిల్లా అగ్నిమాపక అధికారి పి. సింహాచలం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంలో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై వెంకన్న, రెవెన్యూ, వైద్య సిబ్బంది చేరుకుని పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
రేకులషెడ్‌లో అగ్ని ప్రమాదం..
సాలూరు: పట్టణంలోని వేంకటేశ్వర డీలక్స్ సెంటర్‌లో ఓ రేకుల షెడ్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. షెడ్‌లో ఉన్న పాత సామాన్లు కాలి, పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి రాజారావు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.


