బడి అభివృద్ధి భారం.. దాతలే ఆధారం..!
దాతల వెంటబడి..
● సర్కారు తీరుపై విస్తుపోతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
● జిల్లాలో 1,784 బడులకు రూ.100 కోట్ల అవసరాలు
● నాడు–నేడు నిధులను పక్కనపెట్టి దాతల కోసం ఎదురుచూపు
● దాతలొస్తేనే అభివృద్ధి.. లేదంటే నిరీక్షణ
విజయనగరం అర్బన్: ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం... ఇప్పుడు సర్కారు బడుల అభివృద్ధి బాధ్య తలను దాతలకు బదిలీ చేస్తోంది. దీనికోసం విద్యాంజలి–2.0 పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన ప్రభు త్వం.. ఆ బాధ్యతలను క్రమంగా సమాజం, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల భుజాలపైకి నెట్టేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు నాడు–నేడు నిధులు ఖర్చుచేయరాదని ఆదేశాలిస్తూ... మరోవైపు పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలంటూ విద్యాశాఖ అధికారులతో అవగాహన కల్పిస్తుండడంపై మేధావులు పెదవి విరుస్తున్నారు. దాతలు దొరికేవరకు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022 లో ప్రారంభించిన విద్యాంజలి 2.0 కార్యక్రమం అప్పట్లో పూర్తిగా విఫలమైనా... కారణాలను సమీక్షించకుండా, నిధుల భరోసా ఇవ్వకుండా మళ్లీ అదే పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వమే ఖర్చుచేయాల్సిన విద్యారంగాన్ని ‘లాగిన్–రిజిస్ట్రేషన్–వాలంటీర్’ మోడల్‌కు పరిమితం చేయడాన్ని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
ఉన్న నిధులు ఖర్చుచేయకుండా...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ పథకం కింద మొదటి విడతగా రూ.183 కోట్ల నిధులను వెచ్చించి జిల్లాలోని 841 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టింది. ఆధునిక హంగులు కల్పించింది. రెండో విడతగా పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంక్షేమ పాఠశాలలు కలిపి 738 విద్యాలయాల అభివృద్ధికి రూ. 231 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.126 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. తర్వా త వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.105 కోట్ల నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి పనులను మధ్యలోనే ఆపేసింది. మరోవైపు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నాడు–నేడు నిధులు రూ.10 కోట్లను వినియోగించవద్దని ఆదేశాలు ఇచ్చింది. కనీసం స్కూళ్ల ఖాతాల్లో ఉన్న నిధులను కూడా వినియోగించవద్దని ఆదేశిస్తూ.. ఇప్పుడు దాతల కోసం ఎదురుచూడమంటున్న ప్రభుత్వ విధానాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.
రూ.100 కోట్లు దాతలు సమకూర్చగలరా?
జిల్లా 1,784 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలోని 1235 పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.225 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో తరగతి గదులు, విద్యుత్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, మరమ్మతుల కోసం మరో రూ. వంద కోట్లు అవసరమవుతాయి. ఇంత మొత్తంలో ప్రభుత్వం ఒక్క రూపాయి నిధిని కేటాయించకుండా ‘నగదు వద్దు వస్తువులే ఇవ్వండి’ అంటూ దాతల చుట్టూ తిరగడం పాలనావైఫల్యానికి నిదర్శమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సదుపాయాలు కలిగేనా?
జిల్లాలో 992 పాఠశాలల విద్యుత్ సౌకర్యాలకు రూ.9.9 కోట్లు, 1.363 పాఠశాలల తరగతి గదుల నిర్మాణావసరాలకు రూ.16.47 కోట్లు, 1,111 పాఠశాలల డిజిటల్ మౌలిక సదుపాయాలకు రూ.15.25 కోట్లు, 1,130 పాఠశాలల భవనాల మరమ్మతుల కోసం రూ.8.65 కోట్లు అవసరమని విద్యాశాఖ వద్ద ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. ఈ అవసరాలు తీరాలంటే దాతలు ముందుకు రావాలన్న షరతు పెట్టడం ద్వారా... ప్రభుత్వ బడులు భవిష్యత్తును అనిశ్చితలోకి నెట్టేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. దాతల రాకపోతే ఆ పాఠశాలల విద్యార్థులు శాశ్వతంగా వెనుకబడిపోవాలా? అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
విద్యాంజలి 2.0 పథకం అమలు నేపథ్యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల జిల్లా, మండలస్థాయి అవగాహన సదస్సులను సమగ్ర శిక్ష అధికారులు నిర్వహించారు. యోగా, క్రీడలు, సబ్జెక్టుల బోధనకు వలంటీర్లు రావాలంటూ ఆ సదస్సుల్లో సమగ్రశిక్షా ఏపీసీ అధికారి పిలుపునివ్వడం ఒక ఎత్తయితే... తరగతి గుదులు, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రత వంటి మౌలిక వసతుల కోసం కూడా దాతలనే ఆశ్రయించడం మరో ఎత్తు. ఇది సమాజ భాగస్వామ్యమా? లేక ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించుకోవడమా? అన్నచర్చ ఉపాధ్యాయ వర్గాలు, మేధావుల్లో జోరుగా సాగుతోంది. దాతలు స్పందించకుంటే సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులకు సదుపాయాలు కలగవని, చదువులో వెనుకబడిపోతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


