కూటమి వైఫల్యాలపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

కూటమి వైఫల్యాలపై పోరుబాట

Feb 12 2026 7:05 AM | Updated on Feb 12 2026 7:05 AM

కూటమి వైఫల్యాలపై పోరుబాట

కూటమి వైఫల్యాలపై పోరుబాట

యువతే పార్టీకి ఆయువుపట్టు

ఉత్తరాంధ్ర యువజన విభాగం

విస్తృత స్థాయి సమావేశంలో

జక్కంపూడి రాజా

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్‌సీపీ యువజన విభా గం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్‌ అధ్యక్షుడు అంబటి శైలేష్‌ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

యువజన విభాగమే గొంతుక కావాలి

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువజన విభాగం ఎంత బలంగా ఉంటే, ఆ పార్టీ భవిష్యత్తు అంత రెట్టింపు స్థాయిలో పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్‌ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్‌ చైర్మన్‌లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు.

జగన్‌ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట

జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్‌ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్‌ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్‌ సీపీలో ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్‌, గబ్బిడి శేఖర్‌, అల్లు అవినాష్‌, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement