పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: పదో తరగతి, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి జరిగే పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు జిల్లాకు చెందిన 23,523 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వీరిలో 22,959 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల కోసం మొత్తం 119 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్లు, ఎంపీడీఓ/ మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేసి సోమవారం నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 స్టోరేజ్ పాయింట్లు, సుమా రు 1,350 మంది ఇన్విజిలేటర్లను వినియోగిస్తున్నామని తెలిపారు. హాల్ టికెట్‌పై క్యూఆర్‌కోడ్ రూపంలో పరీక్ష కేంద్ర వివరాలు ముద్రించి ఉంటాయని, వాటిని స్కాన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సుల సమయాల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఇ.మురళి, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డీపీటీఓ జి.వరలక్ష్మి, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.


