చేతి వృత్తిదారులకు శఠగోపం
పార్వతీపురంటౌన్: చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవించేవారి అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మయోజన అమలులో నీరుగారిపోయింది. లక్ష్యాలు ఘనంగా ఉన్నా అమలు మాత్రం తూతూ మంత్రంగానే ఉంది. మొక్కుబడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పథకం చేరువ కాక పూర్తిస్థాయిలో నష్టపోతున్నామని లబ్ధిదారులు వా పోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో విశ్వకర్మ కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హత ఉన్నా సాంకేతికత, ఽధ్రువీకరణ పత్రాల అప్‌లోడేషన్ వంటి కారణాలతో లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బ్యాంకర్లు విశ్వకర్మ పథకం అమలుకు అసలు సహకారం అందించడం లేదని లబ్ధిదారుల నుంచి విమర్శలు చాలా ఉన్నాయి. బ్యాంకర్లను రుణాలు ఇచ్చేందుకు ఒప్పించడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం విఫలమయ్యాయి.
చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేతివృత్తులు, కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక సహాయం, పనిముట్లు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఆధునిక పనిముట్లు, వస్తువుల కొనుగోళ్లలో రాయితీ అందించడం, చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం ద్వారా సంప్రదాయ కళలు, చేతి వృత్తులను ప్రోత్సహించడం ఈ పథక ఉద్దేశం. ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రాథమిక, ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ప్రోత్సాహకం కింద రూ.15వేల కిట్లను అందజేశారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకు నుంచి తొలి విడతలో తక్కువ వడ్డీకి రూ.లక్ష, అనంతరం రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. కుమ్మరి, వడ్రంగి, కమ్మరి, శిల్పి, స్వర్ణకారులు, దోబి, పూలమాలలు అల్లేవారు. చేపలు పట్టేవారు. ఇలా 18 రకాల వృత్తుల వారికి విశ్వకర్మ పథకం వర్తిస్తుంది. చేతి వృత్తుల వారు విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా మొక్కుబడిగా మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం.
విశ్వకర్మ పథకం అమలులో నిర్లక్ష్యం
వేలల్లో దరఖాస్తులు.. వందల్లో లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలో 25,816 మంది దరఖాస్తులు
ఎంపిక చేసింది కేవలం982మందిని మాత్రమే


