గిరిజన యువకుడి ఆత్మహత్య
సీతంపేట: కొండపోడు పనికి నాతో రా, లేకపోతే అన్నయ్య కుమారుడికి జ్వరంగా ఉంది పాలకొండ ఆస్పత్రికి అయినా తీసుకువెళ్లు అని తాత చెబితే వినకుండా వాగ్వాదానికి దిగిన మనుమడు చివరకు క్షణికావేశంలో కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేట మండలంలో మంగళవారం జరిగిన ఈ సంఘటనపై స్థాని కులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. చాకలిగూడ గ్రామానికి చెందిన సవర ప్రేమ్‌కుమార్(23) తండ్రి రాజేష్, వెంకటమ్మలు పదేళ్ల కిందట అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. తాతయ్య గోపాలు, నాన్నమ్మ సుక్కమ్మ వద్ద ప్రేమ్‌కుమార్ ఉంటున్నాడు. వారితో పాటు అన్నయ్య శాంతకుమార్, వదిన వారి కుమారుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎవరి పనుల్లో వారు ఉండగా తాత గోపాలు కొండపోడు పనులకు వెళ్దామని చెప్పి ఒక సంచిలో కత్తి, వాటర్ బాటిల్ సిద్ధం చేసి పడుకుని ఉన్న ప్రేమ్‌కుమార్‌ను లేపి పనికి వెళ్దాం రమ్మని పిలిచాడు. నేను రాను అని చెప్పగా అయితే అన్నయ్యను పనికి తీసుకువెళ్తాను. అన్నయ్యకుమారుడికి జ్వరంగా ఉండడంతో వదినతో పాటు పాలకొండ ఆస్పత్రికి వెళ్లమని చెప్పాడు. అక్కడికి కూడా వెళ్లనని ప్రేమ్‌కుమార్ చెప్పడంతో కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తాత వంటింటిలోకి అన్నం పెట్టిన బాక్సు తీసుకురావడానికి వెళ్లాడు. దీంతో సంచిలో ఉన్న కత్తిని ప్రేమ్‌కుమార్ తీసుకుని పీక కోసేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మర్గమధ్యంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నయ్య శాంతకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
గిరిజన యువకుడి ఆత్మహత్య


