చట్ట ప్రకారం పిల్లల దత్తత
● ఐసీడీఎస్ పీడీ విమలరాణి
విజయనగరం ఫోర్ట్: పిల్లలను చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్ పీడీ టి.విమలరాణి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని కేఎల్ పురంలో ఉన్న శిశు గృహాన్ని ఆకస్మికంగా ఆమె మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్ట రీత్యానేరమని తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. శిశుగృహలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు, ప్రతిరోజూ మెనూ కచ్చితంగా అమలు చేయాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాణి పేటలో ఉన్న బాలసదన్‌ను తనిఖీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు బాలసదన్‌లో ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 6 నుంచి11 సంవత్సరాల వయసు గల బాలికలు బాలసదన్‌లో ఆశ్రయం పొందుతారన్నారు. కార్యక్రమంలో డీఎంసీ సుజాత, శిశు గృహ మేనేజర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి బొబ్బిలి పట్టణానికి తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆర్‌ఐ కొల్లి రామకుమార్ మంగళవారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.ఇసుక అక్రమ రవాణాలో మొదటిసారి దొరికినందున ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు ఆర్‌ఐ తెలియజేశారు. వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ విభాగం నిఘా ఉందని తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని, మరో మారు అక్రమ ఇసుకతో పట్టుబడితే కేసులు పెడతామని ట్రాక్టర్ యజమానులను ఆర్‌ఐ హెచ్చరించారు.
గంజాయి కేసులో ముద్దాయికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష
విజయనగరం క్రైమ్: గంజాయితో పట్టుబడిన నిందితుడికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష, రూ.75 వేల జరిమానాను కోర్టు విధించిందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు మంగళవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..గతేడాది ఫిబ్రవరి 8 వ తేదీన దక్షిణ ఢిల్లీకి చెందిన నీరజ్ సింగ్(25)విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం 4,5లలో జీఆర్‌పీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని, 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అప్పటి విజయనగరం రైల్వే ఎస్సై వి.రవి వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందిడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి జైలు శిక్ష విధించారని, జరిమానా చెల్లించని ఎడల మరో ఆరు నెలలు జైలు శిక్ష వర్తిస్తుందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు.


