ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలి
● ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్,
ప్రొఫెసర్ ఎన్.మోహన్‌కుమార్
విజయనగరం అర్బన్: రానున్న మార్చి 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ–2026) ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం తోటపాలెంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శివ్వాల తవిటినాయుడు అధ్యక్షతన వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.మోహన్ కుమార్ మారిన సిలబస్, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల విధానాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరానికి సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో (భాషా సబ్జెక్టులు మినహా) 14 సబ్జెక్టులకు నూతన సిలబస్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలు పూర్తిగా సీబీఎస్‌ఈ తరహాలో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. బోటనీ, జూవాలజీని బయాలజీగా కలిపి ఒకే సబ్జెక్టుగా చేయడం, గణితాన్ని 1ఏ, 1బీగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంగా ప్రవేశపెట్టడం, సైన్స్ పేపర్ల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించడం వంటి కీలక సంస్కరణలను వివరించారు. సిలబస్ మారిన 14 సబ్జెక్టులకు 32 పేజీల సమాధానం బుక్లెట్లు, బయాలజీ (బోటనీ–జూవాలజీ)కి 24 పేజీల బుక్‌లెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి పబ్లిక్ పరీక్షలు 30 రోజుల పాటు నిర్వహించే నేపథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు (డీఓలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఏర్పాట్లు పూర్తి
డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో అధ్యాపకులు మారిన సిలబస్, పరీక్షల విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలోని 66 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఎం.సత్యనారాయణ, ఎన్‌ఎల్‌వీజగన్నాథరావు, కె.అప్పారావు, పీఎల్‌ఎస్‌ప్రకాష్ పట్నాయక్, వీకేవీకృష్ణారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


