మనమిత్రతో పోలీసు సేవలు సులభతరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం క్రైమ్: ‘మనమిత్ర‘ అనే వాట్సాప్ గ్రూప్‌తో పోలీసు సేవలు మరింత సులభతరం చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. డిజిటల్ పాలనలో భాగంగా పోలీస్ సేవలు మరింత సులభతరంగా, త్వరితంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువ చ్చామన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే పోలీసు సేవలను పొందవచ్చునన్నారు. ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈచలాన్ వివరాలు వంటివి సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే సులభంగా పొందవచ్చన్నారు. ఈ సేవలను పొందేందుకు ప్రజలు ముందుగా 9552300009 సెల్ నంబరును వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకుని, ఆ నంబర్‌కు ఏజీ అని మెసేజ్ చేయగానే వివిధ రకాల ప్రభుత్వ సేవలు వివరాలు మొబైల్ కు వస్తాయన్నారు. అందులో పోలీసుశాఖ సేవలను ఎంచుకుని, ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ స్థితి, ఈచలాన్ వివారాలు సులభంగా ఇంటివద్ద నుంచే పొందవచ్చన్నారు. క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా పైన తెలిపిన పోలీసు సేవలు తక్షణమే పొందవచ్చునన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీసు ఆఫీసులలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ద్వారా ప్రజల సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.


