బైక్, మినీ వ్యాన్ ఢీకొని మహిళ మృతి
చీపురుపల్లి: పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు ఆదిలక్ష్మి(25) మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజాంకు చెందిన బల్ల జగదీష్, ఆర్.ఠాగూర్‌లతో కలిసి చీపురుపల్లి పట్టణంలోని కూరాకుల వీధికి చెందిన పొందూరు ఆదిలక్ష్మి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్నారు. జీవీఆర్ కళాశాల వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న మినీ లగేజ్ వ్యాన్‌ను బైక్‌తో ఢీకొట్టారు. దీంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. జగదీష్‌కు చేయి విరిగింది. ఠాగూర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని చీపురుపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ జి.శంకరరావు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తోటపాలెంలో పశువైద్య సేవలు
విజయనగరం అర్బన్: స్థానిక పట్టణంలోని తోటపాలెం సత్య డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పశువైద్య సేవలు అందించారు. పశు వైద్యులు మోహన్..పాడిరైతులు తీసుకువచ్చిన మూగజీవాలకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించి, అవసరమైన వాటికి మందులు అందజేశారు. అలాగే వ్యాధులు రాకుండా నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తదితరులు పాల్గొన్నారు.


