వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఐదు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను విజయనగరం.ఎన్‌ఐసి.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్యకళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్‌కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, పీఈటీ, లైబ్రరీ అసిస్టెంట్, స్పీచ్ థెరపిస్టు, సైకియాట్రీ సోషల్ వర్కర్ తదితర ఏడు కేటగిరీల పోస్టులకు సంబంధించిన షార్ట్‌లిస్ట్‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్–3, ఎలక్ట్రికల్ హెల్పర్, స్టోర్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల జాబితాను కూడా పొందుపరిచామని చెప్పారు. వీటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 19వ తేదీలోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు.
400 క్యూసెక్కుల నీరు విడుదల
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి ప్రధాన కాలువకు అధికారులు సాగునీటి సరఫరాను పెంచారు. రబీ పంటల సాగుకోసం ఇటీవల 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా... ప్రస్తుతం మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి 400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఆయన వెల్లడించారు.
సముద్రంలో
మత్స్యకారుడు గల్లంతు
మహారాణిపేట: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు(55) నగరంలోని జాలరిపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న ఫిషింగ్ హార్బర్ నుంచి ఐఎన్‌డీ ఏపీవీ5, ఎంఎం 872 నంబర్ గల బోటులో రాములుతో సహా మొత్తం ఎనిమిది మంది మత్స్యకారులు వేటకు బయలుదేరారు. హార్బర్ నుంచి తూర్పు వైపు విశాఖకు 70 మైళ్ల దూరంలో వారు చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి 8.30 గంటల సమయంలో వేటలో ఉండగా.. రాములు ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి మత్స్యకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న ఇతర బోట్ల మత్స్యకారులకు సమాచారం అందించి వారి సాయంతో వెతికినా.. రాములు ఆచూకీ లభించలేదు. దీంతో బోటు డ్రైవర్ వాసుపల్లి లక్ష్మణరావు విషయాన్ని హార్బర్ అసోసియేషన్ నాయకులకు చేరవేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బోటు హార్బర్‌కు చేరుకోగానే మత్స్యకారులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురుకులంలో ఆకలికేకలపై
స్పందించిన అధికారులు
భామిని: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఎంపీడీవో ఎస్.వసంతకుమారి మంగళవారం సందర్శించారు. సాక్షిలో ఈ నెల 15న ‘గురుకులంలో ఆకలికేకలు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో వసంతకుమారి గురుకులాన్ని సందర్శించి ప్రిన్సిపాల్ విజయనిర్మలతో కలిసి వంట గదిని నిశితంగా పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్, సిబ్బంది వహించాలన్నారు. చేసిన వంటలను పరిశీలించి మెనూ ప్రకారం అమలు చేయాలని సూచించారు. గురుకుల సిబ్బంది ఉన్నారు.
వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా
వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా


