ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు
● జేసీ సేతుమాధవన్
విజయనగరం అర్బన్: పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ చాంబర్‌లో మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలటీల్లో ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ కన్వీనర్, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య వివరించారు. దీనిపై జేసీ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మొదటిసారి దొరికితే జరిమానాతో పాటు అవగాహన కల్పించాలని, రెండోసారి దొరికితే భారీ జరిమానా విధించాలని, అవసరమైతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని సూచించారు. దాడులు నిర్వహించే అధికార బృందాలకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలని, వాటి తయారు చేసే కంపెనీలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పి.నల్లనయ్య, ఎ.రామచంద్రరావు, ఎల్.రామలక్ష్మి, జనార్దనరావు, పర్యావరణ ఇంజనీరు సరిత, పరిశ్రమల శాఖ మేనేజర్, ఇతర శాఖల అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


