చోరీకి గురైన బంగారు ఆభరణాల రికవరీ
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో పట్టపగలు చోరీలకు పాల్పడిన వ్యక్తిని వల్లంపూడి పోలీసులు సోమవారం పట్టుకుని దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వావిలపాడు, వల్లంపూడి, రామస్వామిపేట గ్రామాల్లో పట్టపగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగిన విషయం విదితమే. దీనిపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్, సిబ్బందితో నిర్వహించిన తనిఖీల్లో సోమవారం కుమ్మపల్లి జంక్షన్ వద్ద అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజును నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తివద్ద రామస్వామిపేటలో దొంగిలించిన ఐదున్నర తులాలు, వావిలపాడులో దొంగిలించిన తులంన్నర బంగారం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. వల్లంపూడిలో చోరీ చేసిన బంగారం చోడవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు సీఐ చెప్పారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని కోర్టుకు తరలిస్తామన్నారు.


