ఐఎస్‌ఏ–ఏటీలో రమ్య ఫస్ట్
విజయనగరం అర్బన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అసెస్‌మెంట్ టెస్ట్ (ఐఎస్‌ఏ–ఏటీ) ఫలితాల్లో జిల్లాకు చెందిన యువ ఆటిటర్ ఎ.వెంకటరమ్య ప్రతిభ చూపింది. ఆలిఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. గత కొన్నేళ్లుగా జిల్లాలో మంచి చార్టర్డ్ అకౌంటెంట్‌గా, ఆడిటర్‌గా పేరొందిన రమ్య ఐటీ సిస్టమ్స్ ఆడిట్ రంగంలో నిరంతర అధ్యయనం, కఠోర సాధనతో పరీక్షలో విజేతగా నిలిచింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఐఎస్‌ఏ ఆడిట్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో డీఐఎస్‌ఏ సర్టిఫికేట్ ఉన్న ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. సైబర్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ గవర్నెన్స్, డేటా సెక్యూరిటీ రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయని రమ్య పేర్కొంది.
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం టౌన్: సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్‌కు సిద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇచ్చే ఉచిత శిక్షణకోసం ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతిశ్రీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారన్నారు. అందులో అర్హత పొందిన వారికి డిసెంబర్ 10 నుంచి విజయవాడ గొల్లపూడిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు రెండు ఫొటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్‌కార్డు జతపరిచి కలెక్టరేట్‌లో ఉన్న కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు సెల్: 96035 57333, 98668 86844 నంబర్లను సంప్రదించాలన్నారు.
పీజీఆర్‌ఎస్ వినతులపై కలెక్టర్ సమీక్ష
విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అర్జీదారులు చెప్పే సమస్యలను పూర్తిగా అర్ధం చేసుకోవాలని, వారి మాటలను ఓపికతో విన్నప్పుడే వారికి నిజమైన సంతృప్తి కలుగుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ వినతుల పరిష్కారంపై అధికారులతో సోమవారం సమీక్షించారు. వినతుల పరిష్కారానికి అధికారులే చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారుల అసంతృప్తి శాతం ఎక్కువగా ఉన్న మండలాల్లోని తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్న అర్జీలను మండల ప్రత్యేక అధికారులు స్వయంగా సమీక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్ మురళి పాల్గొన్నారు.
భూముల స్వాధీనం అన్యాయం
● కలెక్టరేట్ ఎదుట నిరసన
విజయనగరం అర్బన్: ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని గుర్ల మండలంలోని బెల్లానపేట, దమరసింగి, కెల్ల, వల్లాపురం, మాన్యపురిపేట రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం 1,085 ఎకరాలు, టౌన్‌షిప్‌కి 97.04 ఎకరాలు, రైల్వే సైడింగ్‌కి 53.35 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విచారకరమన్నారు. జీవనాధారమైన భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. రైతులతో సమగ్రంగా మాట్లాడి, న్యాయమైన పరిహారం ప్రకటించాకే సేకరణ సర్వే చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డికి విన్నవించారు.
పోస్టుల భర్తీకి డిమాండ్
● కలెక్టర్‌కు చెవిటి, విభిన్న సామర్థ్యాల నిరుద్యోగులు వినతి
విజయనగరం అర్బన్: జిల్లా అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ (విభిన్న సామర్థ్యాలు–చెవిటి) కేటగిరీకి కేటాయించిన గ్రూప్–4 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి సోమవారం వినతి పత్రం అందజేశారు. గత ఎనిమిదేళ్లుగా ఈ కేటగిరీ అభ్యర్థులతో ఒక్క గ్రూప్–4 పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాల కోసం జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా చెవిటి, మూగ యువకులు ఎదరుచూస్తున్నారన్నారు.
ఐఎస్‌ఏ–ఏటీలో రమ్య ఫస్ట్
ఐఎస్‌ఏ–ఏటీలో రమ్య ఫస్ట్


