శిక్షణ నిమిత్తం 37 మంది కొత్త ఆర్‌ఎస్సైలు
పార్వతీపురం రూరల్: అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో గ్రేహౌండ్స్‌లో శిక్షణను పూర్తి చేసుకున్న 37 మంది నూతన ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఎస్సైలు) ప్రాక్టికల్ శిక్షణ కోసం పార్వతీపురం మన్యం జిల్లాకు బుధవారం వచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలలో విధుల అనుభవం కోసం వారిని జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డిని వారంతా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో వారితో ఎస్పీ మాట్లాడుతూ ముందుగా నూతన ప్రొబేషనరీ ఆర్‌ఎసైలకు శుభాకాంక్షలు తెలిపారు. వారిని జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్లను కేటాయించారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలని క్రమశిక్షణే మీ బలం కావాలి అని ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా, ఆర్‌ఎస్సైలు విధిగా ఏజెన్సీ గ్రామాలను సందర్శించాలని, ప్రజలతో మమేకమై వారి ద్వారా సరైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కూంబింగ్ ఆపరేషన్లపై దృష్టి పెట్టాలని, చుట్టుపక్కల కదలికలు, వారికి సహకరించే వారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. వారంవారీగా సంతల సందర్శన, అధిక మొత్తంలో సరుకులు కొనుగోలు చేసే వారిపై దృష్టి పెట్టడం, వాహన తనిఖీలు చేయడం తప్పనిసరి అన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సమాచార సేకరణలో గోప్యత పాటించాలని చెప్పారు. ఏమాత్రం సందేహం వచ్చినా సీనియర్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి


