తొమ్మిదవ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు
● నేటి నుంచి మూడురోజుల పాటు నిర్వహణ
● ఆహ్వానపత్రికలను ఆవిష్కరించిన సంస్ధ ప్రతినిధులు
విజయనగరం టౌన్: అభినయ నాటకశాల, నటరత్న నాటక పరిషత్ సంయక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, విజయవాడ నిర్వహణలో 9వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఈ నెల 6,7,8 తేదీల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సంస్ధ ప్రతినిధులు అభియన శ్రీనివాస్, గెద్ద వర ప్రసాద్‌లు తెలిపారు. ఈ మేరకు స్థానిక హుకుంపేట బుక్కావీధిలో ఉన్న ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో బుధవారం ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం విశాఖ చైతన్య కళాస్రవంతి సంస్ధ ఆధ్వర్యంలో పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో అసత్యం అనే సాంఘిక నాటిక ప్రదర్శిస్తారన్నారు. అనంతరం 8 గంటలకు డాక్టర్ చిలుకూరి నాగేశ్వరరావు రచనలో గెద్ద వరప్రసాద్ దర్శకత్వంలో విజయనగరం నాటకశాల ఆధ్వర్యంలో సూత్రం అనే సాంఘిక నాటిక ఉంటుందన్నారు. 7న శుక్రవారం తెలంగాణ సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మంజునాథ రచన, దర్శకత్వంలో గేమ్ అనే నాటిక, 8 గంటలకు గుంటూరు జిల్లా కట్రపాటు ఉషోదయ కళానికేతన్ ఆధ్వర్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వంలో కిడ్నాప్ అనే సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుందన్నారు. అదేవిధంగా 8న శనివారం కరీంనగర్ చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో రమేష్ మంచాల దర్శకత్వంలో సప్నం రాల్చిన అమృతం, రాత్రి 8 గంటలకు గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో అమ్మ చెక్కిన బొమ్మ అనే సాంఘిక నాటిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన కళాకారులందరికీ పురస్కారాలను అతిథులు అందజేస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే నాటిక పోటీలకు కళాకారులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.


