కళాజాతరకు శ్రీకారం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రతిభావంతులైన, ఔత్సాహిక కళాకారులను వెలుగులోకి తెచ్చేందుకు, వారి కళారూపాలకు సముచిత వేదిక కల్పించేందుకు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ‘కళాజాతర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని గాయకులు, నృత్యకారులు, చిత్రకారులు, మిమిక్రీ, ఇంద్రజాలం, శాసీ్త్రయ, జానపద కళారూపాలతో పాటు గిరిజన కళాప్రదర్శనలు, కవులు, నాటిక–నాటక రచయితలు సహా అన్ని కళారూపాలకు ఇది అత్యంత కీలకం కానుంది. ప్రతి 15 రోజులకు సాంస్కృతిక పోటీలు, ప్రదర్శనలు నిర్వహించి, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కళాకారులు నమోదు ఫారం ద్వారా తమ వివరాలను 99499 96497 నంబరుకు వాట్సాప్ లేదా మన్యం సంస్కృతి ఎట్‌ద రేటాఫ్ జీమెయిల్.కామ్ మెయిల్ చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను 2026 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ గొప్ప అవకాశాన్ని జిల్లాలోని కళాకారులు, యువతరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దివ్యాంగులు సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి
పార్వతీపురం: దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని డీఈఓ బి.రాజ్‌కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ఎంఈఓలు, రిసోర్స్ పర్సన్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహిత విద్యను బలోపేతం చేసేందుకు దివ్యాంగ పిల్లలకు పలు రాయితీలను ప్రకటించినట్లు తెలిపారు. పదవతరగతి, ఇంటర్‌మీడియట్ పరీక్షలలో దివ్యాంగ పిల్లలకు ఉన్న అలవెన్సులను, రాయితీలను, ఐఈపీలు అందిస్తున్న సేవలు దివ్యాంగులకు అందేలా చూడాలన్నారు. సమావేశంలో ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


