అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
● గోవిందనామస్మరణతో మార్మోగిన
వేదిక ప్రాంగణం
సీతంపేట: వేదపండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. గోవిందుని కల్యాణంతో సీతంపేట అధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణ ఘట్టాన్ని కళ్లారా చూసి భక్తులు పారవశ్యం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో వేదిక ప్రాంగంణం మార్మోగింది. తిరుమల శ్రీవారి అర్చక బృందం ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. స్వామివారికి అర్చన, తోమాల సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆయన సతీమణితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. మారుమూల ప్రాంతాల్లో హైందవ దర్మంపై ప్రచారాన్ని చేయడానికి గోవింద కల్యాణాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సీతంపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం, కుంకుమ, హ్యాండ్‌బుక్‌లు అందజేశారు. అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్సై అమ్మన్నరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీటీడీ అర్చక బృందం సభ్యులు కృష్ణ సాయిస్వామి తదితరులు పాల్గొన్నారు.


