బేబీనాయనను నమ్మి మోసపోయాం
● టీడీపీని వీడి 100 కుటుంబాలు
వైఎస్సార్‌సీపీలో చేరిక
● కండువాలు వేసి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి: అంతన్నారు..ఇంతన్నారు.. ఉత్తుత్తి హామీలతో మోసం చేశారు.. గ్రామ సమస్యలు పరిష్కరించాలని పదేపదే విన్నవించినా ఎమ్మెల్యే బేబీనాయన పట్టించుకోవడంలేదంటూ కోమటిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వాపోయారు. టీడీపీని వీడి బొబ్బిలిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్ గొట్టాపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎం.తిరుపతిరావు, గొట్టాపు త్రినాధరావు, మంతిని ధనుంజయ, జమదాల వెంకటరమణ, జక్కు తవిటినాయుడు, ఎస్.వేమన, వడ్డి సునీల్, బొత్స జజ్జులు, వెలమల అప్పలనాయుడు, వెలమల దాలినాయుడు, బోను త్రినాథ, తదితర కుటుంబాల సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కోమటిపల్లి మాజీ సర్పంచ్ వెలమల శంకరరావు మాట్లాడుతూ ఇన్నాళ్లూ బొబ్బిలి రాజులు తమ గ్రామానికి ఏదో చేస్తారన్న భ్రమలో ఉండిపోయామని, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పగ్గాలు చేపట్టినా మా గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. దశాబ్దకాలం వారితో కలిసి నడిచినా న్యాయం జరగదన్న స్పష్టత రావడంతో టీడీపీని వీడుతున్నామన్నారు. మరో కార్యకర్త ప్రకాష్ మాట్లాడుతూ తమకు వెన్నుపోటు రాజకీయాలు చేతకావని, ఇదిగో అదిగో అంటూ దాటవేత ధోరణిలో ఉన్న ఎమ్మెల్యే బేబీనాయన ఏదో చేస్తారన్న మాయలో పడి ఇన్నాళ్లూ ఆ పార్టీలో కొనసాగామన్నారు. ఇక ఆయనను నమ్మేది లేదని, తమ సత్తా ఏమిటో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 80 శాతం ఉన్న బీసీలను కేవలం ఒక్క శాతం కూడా లేని రాజులు డబ్బు, అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతూ పదవులు అనుభవిస్తున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీలో మోసగాళ్ల రాజ్యంనడుస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ బొఇ్బలి మండలాధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి బొద్దల సత్యనారాయణ, గొట్టాపు అప్పారావు, వంగపండు శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు.
బేబీనాయనను నమ్మి మోసపోయాం


