నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
విజయనగరం రూరల్: జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 6న నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 29న నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం మోంథా తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని కోరారు.
విజేతలకు అభినందనలు
విజయనగరం అర్బన్: విజయనగరంలోని కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాలో బుధవారం నిర్వహించిన సైన్స్ డ్రామా జిల్లా స్థాయి పోటీల విజేతలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు అభినందించారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం, బెంగుళూరు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో బొండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘హైజిన్ ఫర్ ఆల్’ నాటకానికి మొదటి స్థానం లభించింది. విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నాటిక బృందం ఎంపికై నట్టు జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్ తెలిపారు. అలాగే, దత్తిరాజేరు మండలం షికారుగంజి ఏపీ మోడల్ స్కూల్, ఆర్సీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి. కస్పా స్కూల్ హెచ్‌ఎం విశాలాక్షి సమక్షంలో సాగిన పోటీల్లో రీసోర్స్ పర్సన్స్‌గా కె.సతీష్ కుమార్, ఎ.భానుప్రకాష్, న్యాయ నిర్ణేతగా ఈపు విజయలక్ష్మి వ్యవహరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని డీఈఓ ఆకాంక్షించారు.
భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. డీఎస్పీ ఎన్.రమ్య, ఇద్దరు సీఐలు, సిబ్బంది కలిసి కార్యాలయం తలుపులు మూసేసి ఉదయం 11.30 నుంచి రాత్రి 7 గంటల వరకు రికార్డులు తనిఖీ చేశారు. రోజువారీ రిజిష్ట్రేషన్లు, నెలలో జరిగే రిజిస్ట్రేషన్ల సంఖ్య, ప్రభుత్వానికి రోజుకి వస్తున్న ఆదాయం తదితర వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఏసీబీ అధికారులు వచ్చే సమయానికి పది నిమిషాల ముందు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ కార్యాలయం నుంచి బయటకు వెళ్లి పోయారు. సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మి ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చినట్టు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఎవరికంట పడకుండా ఆటోలో కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని, గురువారం కూడా తనిఖీలు చేస్తామని, అందుకే కార్యాలయాన్ని సీజ్ చేసినట్టు డీఎస్పీ రమ్య మీడియాకు తెలిపారు.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం


