తేవడం.. తీసుకెళ్లడం.. అంతా డోలీలోనే...
ఈ చిత్రం చూశారా... డోలీలో ఉన్నది కొమరాడ మండలం కుంతేస్ పంచాయతీ జొప్పంగి గ్రామానికి చెందిన హిమరిక సావిత్రి. ఆమెకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసిమండ వరకు రాళ్లదారిలో డోలీలో మోసుకొచ్చారు. అక్కడ నుంచి ఆటోలో కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆమె మగబిడ్డకు జన్మనివ్వడంతో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తిరిగి మళ్లీ అదే రాళ్లదారిలో డోలీలో బాలింతను స్వగ్రామానికి తరలించారు. ఈ దృశ్యాలు చూసిన వారు అయ్యో... గిరిజన బాలింతలకు ఎన్ని కష్టాలు అంటూ నిట్టూర్చారు. గిరిజనులకు ఈ కష్టాలు వీడేది ఎన్నడంటూ గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నించారు. – కొమరాడ


