వెండి గంగాలం వితరణ
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసుల రెడ్డి 22 కిలోల వెండి గంగాలంను వితరణ చేశారు. మంగళవారం ఆలయంలో సుమారు రూ.30 లక్షల విలువున్న వెండి గంగాలంను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆల య అభివృద్ధికి దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని టీటీడీ ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న గాలిగోపురంలో 80 శిల్ప కళాకృతులను నిర్మించనున్నామని, ఒక్కొక్క శిల్ప కళాకృతికి రూ.6వేలు వ్యయం అవుతుందని ఈ మేరకు ఔత్సాహికులు ముందుకు రావాలని టీటీడీ సేవా ట్రస్ట్ సభ్యులు కోరారు.
అడ్వంచర్ పార్కులో
అద్దెకు ఫుడ్ స్టాల్స్
సీతంపేట: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అడ్వంచర్ పార్కులో అద్దె ప్రాతిపదికన ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని నిర్వహించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ సూచించిన డిజైన్‌లో నిర్మాణం చేసుకుని ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక ఏడాది కాలనీకి లీజుకు ఇవ్వనున్నట్టు తెలిపారు. రూ.20 వేలు డిపాజిట్, నెలకు రూ.5వేలు అద్దెను ఐటీడీఏకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావున ఆసక్తి గల వారు 9493469084, 9701107785 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి పర్యాటకులను తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీడీ ఇన్‌చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వంచర్ పార్కు, మెట్టుగూడ జలపాతం, ఆడలి వ్యూపాయింట్, బెనరాయి జలపాతం, దారిమల్లి జలపాతం, టీటీదీ దేవాలయం వంటి వాటిని చూడడానికి రోజంతా పర్యాటకులను తిప్పవలసి ఉంటుందన్నారు. అందుకుగాను ఐటీడీఏ నిర్దేశిత రుసుం నిర్ణయిస్తుందన్నారు. ఆసక్తి గల వారు వివరాలకు 9493469084, 9701107785 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తోంది. ఈ మేరకు జిల్లా సమన్వయ అధికారి ఎం.మాణిక్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియన్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో చదివిన విద్యార్ధులు, నీట్ పరీక్షకు హాజరైన వారు ఈ ఉచిత కోచింగ్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్‌లో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఉచిత వసతి, భోజన సదుపాయాలతో కోచింగ్ క్లాసులు ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థులు అంబేద్కర్ స్టడీ సర్కిల్ విజయవాడ 7569226400, 7995562113 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కూలిన పెంకుటిల్లు
జామి: మండలంలో కుమరాం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కనపర్తి అప్పారావు పెంకుటిల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వేకువజాము కావడంతో మెలకువగా ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల సంభవించిన మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా దెబ్బతింది. దీంతో పూర్తిగా నేలమట్టమైంది. విషయం తెలుసు కున్న రెవెన్యూ అధికారులు ఇంటిని పరిశీలించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
వెండి గంగాలం వితరణ


