ప్రజాభిప్రాయానికే వైఎస్సార్‌సీపీ మద్దతు
● మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
మెంటాడ: ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగేలా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, తను మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెంటాడ నుంచి పార్వతీపురానికి సుమారు 100కి లోమీటర్లు దూరం ఉంటుందని విజయనగరం 30 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజయనగరంతో ఉన్న అనుబంధం, కలెక్టర్ కార్యాలయ పనులకై నా వెళ్లివచ్చే విధంగా ఉంటుందన్నారు. మండల ప్రజల బాధలను కమిటీకి వివరించి వారిపై ఒత్తిడి చేసి కొనసాగేలా చేస్తే.. ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీ రాజకీయ లబ్ధి కోసమే మండలాన్ని విజయనగరంలో ఉంచిందని ఎలా రాస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. అప్పట్లో టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడారని, నేడు ఆ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. మెంటాడ మండలం పార్వతీపురంలో కలిస్తే టీడీపీ నాయకులే కారకులవుతారని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ ఈశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, రాజప్పలనాయుడు, ఎంపీటీసీ పతివాడ కుమారి, సర్పంచ్ రాంబాబు, సిరిసెట్టి నారాయణరావు మండల నాయకులు పాల్గొన్నారు.
ఉచిత బస్సుల పేరిట ఉన్న వాటిని తగ్గించేశారు..
సాలూరు: ఉచిత బస్సుల పేరుతో గ్రామాలకు వెళ్లే ఉన్న బస్సులు తగ్గించేస్తున్నారని దీనివలన ప్రయాణాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పట్టణంలో తన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. బస్సుల సంఖ్య తగ్గిపోవడం వలన రద్దీ అధికమైపోతుందని తెలిపారు. దీనివలన బస్సుల్లో వాదులాటలు, తోపులాటలు షరామామూలుగా మారిపోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా బస్సుల్లో ప్రయాణికులు భౌతికంగా, మానసికంగా గాయాల పాలవుతున్నారని అన్నారు. దీనికి ఎవరు భాద్యులవుతారని ప్రశ్నించారు. బస్సుల్లో ఇటీవల పలు సంఘటనలు జరిగాయని అవి వివిధ మాద్యమాలు ద్వారా వచ్చాయని గుర్తు చేశారు. ఉచిత బస్సు వలన డబ్బులిచ్చి టిక్కెట్ తీసుకున్న మగవారికి సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. సీట్లు లేక బస్సులో నిల్చున్న సమయంలో అదుపు తప్పి బస్సులోనే ఒకరిపై ఒకరు పడిపోయి తోపులాటలు జరుగుతున్నాయని అన్నారు. వీటిని ఎలా అరికడతారని, ప్రయాణికులకు రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. దేవాలయాల వద్ద భక్తుల మరణాలకు ప్రైవేటుతో ముడిపెడుతున్న కూటమి ప్రభుత్వం తీరు సరికాదని మండిపడ్డారు.


