వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
మక్కువ: మండలంలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం మక్కువకు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు ఆకుల తవిటినాయుడు, మంగళవారం మధ్యాహ్నం నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకొని, ప్రధాన రహదారి గూండా కాలినడకన ఇంటికి వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు తిప్పేందుకు టర్న్ చేస్తున్న సమయంలో ఢీకొనడంతో గాయాల పాలయ్యారు. ఉపాధ్యాయుడు తవిటినాయుడు ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి, అక్కడ నుంచి విజయనగరం ఆస్పత్రికి తరలించారు. మండలంలోని ములక్యాయవలస గ్రామం వద్ద బైక్‌పై వస్తున్న మెకానిక్ జగదీష్‌ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. జగదీష్‌ను చికిత్స నిమిత్తం బొబ్బిలి తరలించారు.
నిప్పంటుకుని మహిళకు గాయాలు
రాజాం సిటీ: స్థానిక వాసవీనగర్‌లో నివాసం ఉంటున్న టంకాల రేవతమ్మ నిప్పంటుకుని గాయాల పాలైంది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేవతమ్మ స్టౌ వద్ద వంట చేస్తుండగా మంటలు నైటీకి అంటుకుని గాయాల పాలైంది. వెంటనే తేరుకున్న ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలపై నుంచి నీరు పోసుకుని మంటలను అదుపు చేసింది. అనంతరం బొద్దూరు హైస్కూల్‌లో పని చేస్తున్న తన భర్త సత్యనారాయణకు ఫోన్‌లో విషయం చెప్పింది. వెంటనే అతను వచ్చి ఆటోలో రేవతమ్మను సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. బాధితురాలికి ముఖం, తల, వీపు, చేతులపై గాయాలయ్యాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు


