నాగూరు పరిసరాల్లో ఏనుగుల గుంపు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి, సంతోషపురం, నంది వానివలస, పిట్టలమెట్ట, నాగూరు గ్రామ పరిసరాల్లో మూడు రోజుల పాటు ఏనుగుల గుంపు సంచరించి సోమవారం నాగూరు గ్రామంలోని తోటల్లోకి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పంటలను నాశనం చేశాయి. ఏనుగులు ప్రధాన రహదారిని ఆనుకుని సంచరిస్తుండడంతో ప్రజలు రాకపోకలు చేసేందుకు భీతిల్లుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు అటవీశాఖాధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
హుండీ చోరీ నిందితుల అరెస్టు
నెల్లిమర్ల: మండలంలోని కొత్తపేట పరిధిలో ఉన్న శ్రీరమా సహిత వీర వెంకటసత్యనారాయణ స్వామి వారి ఆలయంలో హుండీ పగలగొట్టి, నగదు అపహరించిన కేసులో నిందితులను నెల్లిమర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.ఆలయంలోని హుండీ పగలగొట్టి, నగదు దొంగిలించినట్లు ఇటీవల ఆలయ నిర్వాహకులు నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి కొత్తపేట గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.9వేలు రికవరీ చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేసులను ఛేదించడంలో తమకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని ఆయన చెప్పారు.
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు
రాజాం సిటీ: మండల పరిధి గుయ్యానవలస గ్రామంలో ఆదివారం రాత్రి మచ్చ నాగేష్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులంతా బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన చుట్టుపక్కలవారితోపాటు గ్రామస్తులు మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇంట్లో వస్తువులు, దుస్తులు, వంట సామగ్రితోపాటు డబ్బాలో దాచుకున్న రూ. 30వేల నగదు కాలిపోయాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
గడువులోగా
రీ సర్వే పూర్తి చేయాలి
● సర్వే అండ్ భూరికార్డుల ఆర్‌జేడీ
సీహెచ్‌వీఎస్‌ఎన్‌కుమార్
విజయనగరం అర్బన్: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సర్వే అండ్ భూరికార్డుల ఆర్‌జేడీ సీహెచ్‌వీఎస్‌ఎన్‌కుమార్ ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన సోమవారం కలెక్టరేట్‌లో అధికార, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేయాలని సూచించారు. భూవిస్తీర్ణంపై రైతుకు పూర్తిగా అవగాహన కలిగించిన తరువాతే రికార్డులను ఖరారు చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా వెబ్ ల్యాండ్ ప్రకారం సర్వేపూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అండ్ భూ రికార్డుల ఎ.డి టి.యగ్వేశ్వర రావు, సూపరింటెండెంట్ కె.రాంబాబు డివిజన్‌ల అధికారులు పాల్గొన్నారు.
నాగూరు పరిసరాల్లో ఏనుగుల గుంపు
నాగూరు పరిసరాల్లో ఏనుగుల గుంపు


