అర్జీల తక్షణ పరిష్కారమే ప్రధాన ధ్యేయం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతుల తక్షణ పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సాధ్యమైనంత వరకు వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. పరిష్కారం విషయంలో అర్జీదారులకు సంపూర్ణ సంతృప్తి కలగాలని, ఎలాంటి పరిస్థితుల్లోను అర్జీలు తిరిగి తెరవకూడదని తెలిపారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు అందిన సమస్యల పరిష్కారానికి వచ్చిన వినతుల్లో జంఝావతి రిజర్వ్ ముంపునకు గురైన బంజుగుప్ప గ్రామ నిర్వాసితులకు రీ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని, అలాగే పార్వతీపురం మండలం పెదమరికి గ్రామానికి చెందిన అక్కమ్మ, గంగాపురానికి చెందిన రాములు నాయుడు తమ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కొమరాడ మండలంలోని సోమినాయుడు వలసకు చెందిన ఉమామహేశ్వరరావు తమ జిరాయితీ భూమిని తమ పేరును నమోదు చేసి రికార్డులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే మరికొందరు మరికొన్ని సమస్యలపై వినతులను అందజేశారు. కార్యక్రమంలో మొత్తం 188 వినతులు అందాయి. జిల్లాస్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 123 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో ప్రాజెక్టుఅధికారి పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు 123 వినతులు వచ్చాయి. ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపై వినతులు ఇచ్చారు. కొత్తగూడకు చెందిన రమణమ్మ ఇల్లు నిర్మించడానికి పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది. గేదెలగూడ గ్రామానికి చెందిన బిడ్డిక సలోమి పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని, అటవీపట్టాలు ఇప్పించాలని నల్లరాయిగూడ గ్రామస్తుడు రవికుమార్ కోరారు. పత్తిపంట వర్షాలకు నష్టపోయిందని పరిహారం ఇప్పించాలని అంబలిగండి గ్రామస్తులు కోరారు. విద్యుత్ స్తంభాలను మార్చాలని గంగమ్మపేట గ్రామస్తుడు ఆనందరావు విజ్ఞప్తి చేశాడు. దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని ముకుందాపురం గ్రామస్తురాలు లోకేశ్వరి కోరింది. కార్యక్రమంలో ట్రైబుల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈఓ రామ్మోహన్‌రావు, హెచ్‌వో జయశ్రీ, సీడీపీవో సిమ్మాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
అర్జీల తక్షణ పరిష్కారమే ప్రధాన ధ్యేయం


