జేఎస్‌డబ్ల్యూ మాట తప్పి 18 ఏళ్లు
● ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు
నష్ట పరిహారం ఇవ్వాలి
● కలెక్టరేట్ ఎదుట నిర్వాసిత
కుటుంబాల ధర్నా
విజయనగరం గంటస్తంభం:
జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోయిన రైతులు, బాధిత కుటుంబాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెల్లకాగితాలు పట్టుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతు సోములు కాంతయ్య మాట్లాడుతూ, బొడ్డవర పంచాయతీ, ఎస్.కోట పరిధిలో సర్వే నంబర్ 170 సహా పలుచోట్ల రైతుల భూములను 2007–08లో ప్రభుత్వం జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం కంపెనీకి అప్పగించిందన్నారు. ఒక్కో ఎకరా విలువకు సమానంగా షేర్లు ఇస్తాం. మూడు సంవత్సరాల్లో కనీసం పది రెట్లు పెరుగుతాయని రాతపూర్వక హామీ ఇచ్చారని పేర్కొన్నారు. షేర్లు వద్దనుకుంటే నగదు కలెక్టర్ ద్వారా ఇస్తామని అప్పట్లో చెప్పారని, కానీ అసలు చెల్లింపులు రాలేదని రైతులు ఆరోపించారు. వాగ్దానం ప్రకారం పెరిగిన మొత్తాన్ని అనుసరించి డబ్బులు ఇప్పుడు లెక్కించి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతులకు ఆప్షన్ ఇచ్చి తరువాత మాట తప్పడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జేఎస్‌డబ్ల్యూ కంపెనీపై చర్యలు తీసుకుని నష్టపోయిన భూముల అసలు, పెరిగిన విలువలతో చెల్లింపులు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.


