వసతి గృహాల్లో అధికారులు బస చేయాలి
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని అధికారులు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు తప్పనిసరిగా పాఠశాలలు, వసతిగృహాల్లో ఒక రాత్రి బస చేయాలని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్‌లో జరిగిన వర్క్‌షాపులో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తరచూ పర్యటనలు చేయాలని, బస కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారీ స్థానికంగా ఉన్న పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. అక్కడే ఏదో ఒక వసతి గృహంలో లేదా రెసిడెన్షియల్ పాఠశాలలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాట్సాప్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమయపాలన కచ్చి తంగా పాటించాలని, ఈ మేరకు ఎంపీడీఓలు ఆకస్మిక వేకువజామున తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పారిశుద్ధ్యంతో వ్యాధులను నివా రించవచ్చని, చెత్త నివారణకు ప్రతి దుకాణానికి చెత్త బుట్టలుండాలని, 500 మీటర్ల పరిధిలో చెత్త కనిపిస్తే దుకాణ యజమానికి జరిమానా విధించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన ప్రదేశాల్లో అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీ కెమరాల ఏర్పాటు ఉన్నట్లు ముందుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపట్ల ప్రస్తావిస్తూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి సిబ్బందికి ఐడీ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


