9న జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికపోటీలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలను ఈ నెల 9న నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుసుమంచి సుబ్బారావు, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్లపూడి సుభద్రాదేవిలతో కలిసి ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9 గంటలకు గురజాడ పబ్లిక్ స్కూల్లో పోటీలు ప్రారంభమవుతాయని, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు 10వ తేదీ ఉదయం 9 గంటలకు నగదు బహుమతి ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. పోటీలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, కుసుమంచి ఫౌండేషన్, వాకర్స్ వనిత క్లబ్(విజయనగరం ఫోర్ట్), గురజాడ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. నాటక పోటీలకు సమన్వయకర్తగా నంది పురస్కార గ్రహీత ఈపు విజయ్ కుమార్ వ్యవహరిస్తారని, న్యాయ నిర్ణేతలుగా కందుకూరి పురస్కార గ్రహీత పసుమర్తి సన్యాసిరావు, నంది పురస్కార గ్రహీత గెద్ద వరప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, పాఠశాల కరస్పాండెంట్ ఎం స్వరూప, డిమ్స్ రాజు, డీవీ సత్యనారాయణ, గ్రంధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


