ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేయాలి
విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తన చాంబర్‌లో నిర్వహించి 54 ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 7, నగదు వ్యవహారాలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 28 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.


