బిల్లుల భారం భరించలేం
వేపాడ:
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏనాడూ రూపాయి విద్యుత్ బిల్లు చెల్లించలేదు.. 200 యూనిట్లు మించి ఏ నెలలోనూ వినియోగించలేదు.. ఉచిత విద్యుత్ సదుపాయం పక్కాగా అమలు చేశారు.. ఇప్పుడు ఒక బల్బు, ఫ్యాన్ ఉన్న ఇంటికి కూడా రూ.వేలల్లో విద్యుత్ బిల్లులు ఇస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’.. ఉచిత విద్యుత్ అంటూ గిరిజనులను మోసం చేయడం తగదు.. బిల్లులను తక్షణమే రద్దుచేయాలి.. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తంచేశారు. వేపాడ సబ్‌స్టేషన్ వద్ద కరకవలస పంచాయతీ పరిధిలోని మారిక గ్రామానికి చెందిన గిజనులు సోమవారం ధర్నా చేశారు. గత ఐదేళ్లు ఒక్కరూపాయి బిల్లు కట్టించుకోలేదని, నేడు కూటమి ప్రభుత్వం వేలాది రూపాయల్లో బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేయడం దారుణమంటూ సర్పంచ్ పాతబోయిన పెంటమ్మతో పాటు గిరిజనులు కుమార్, బాబూరావు, బుజ్జిబాబు, అప్పలనాయుడు, దేముడు, రాముడు, జి.దేముడు తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. వీరి ఆందోళనకు సీసీఎం నాయకుడు చల్లా జగన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 యూనిట్లలోపు వాడితే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన ప్రభుత్వం వేలాది రూపాయల్లో చెల్లించమని బిల్లులు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. దసరా మామ్మూళ్ల పేరుతో ఇటీవల ఇంటికి రూ.వంద చొప్పున వసూలు చేశారని, ఇప్పుడు బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన బిల్లులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇప్పటికే చెల్లించిన వారికి బిల్లు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఆందోళనపై స్పందించిన ఇన్‌చార్జి ఏఈ సీహెచ్ సూరిబాబు గిరిజనులతో ఫోన్‌లో మాట్లాడారు. మారిక గ్రామ గిరిజనులు ఇచ్చిన బిల్లులు వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
అన్యాయం
గతంలో గిరిజనులు ఎన్నడూ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మారిక గిరిజనులకు ఇచ్చిన వేలాది రూపాయల బిల్లులు వెనక్కి తీసుకోవాలి. కొండపై నివసించే గిరిజనులకు ఉచిత విద్యుత్ అంటూ ఇలా బిల్లులు చెల్లించాలని చెప్పడం దారుణం. తక్షణమే బిల్లులు వెనక్కితీసుకోవాలి. నా అన్న పాతబోయిన పైడితల్లి పేరున రూ.1680 విద్యుత్ బిల్లు వచ్చింది.
– పాతబోయిన పెంటమ్మ,
గ్రామ సర్పంచ్, కరకవలస (మారిక గ్రామం), వేపాడ మండలం
రూ.5వేలు కట్టాలట..
మా నాన్న గమ్మెల పోతన పేరుమీద రూ.5వేలు బిల్లువచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు డిమాండ్ చేస్తే రూ.2,500 చెల్లించాను. మిగిలింది కట్టపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ బెదిరించారు. తక్షణమే బిల్లులు వెనక్కి తీసుకుని కట్టిన సొమ్ము తిరిగి ఇవ్వాలి.
– గమ్మెల బుజ్జిబాబు, మారిక, వేపాడ మండలం
ద్విచక్రవాహనం ఉంటే బిల్లు ఇస్తారా..
గిరిజనులకు ద్విచక్రవాహనం ఉంటే బిల్లు వస్తుందని అధికారులు భయపెడుతున్నారు. దసరా మామ్మాళ్లు వసూలు చేశారు. మా నాన్మమ్మ పేరున ఉన్న మీటరుకు రూ.2,664 బిల్లు ఇచ్చారు. ఉచిత విద్యుత్ అంటూ కూటమి ప్రభుత్వం గిరిజనులను మోసం చేయడం సరికాదు.
– పి.కుమార్, మారిక గ్రామం, వేపాడ మండలం
గిరిజనులకు వేల రూపాయల
విద్యుత్ బిల్లులు
వేపాడ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన
ఉచిత విద్యుత్ పథకం పక్కాగా అమలు చేయాలని డిమాండ్
బిల్లుల భారం భరించలేం
బిల్లుల భారం భరించలేం
బిల్లుల భారం భరించలేం


