కూటమి తీరుపై కాంట్రాక్టర్ల ఆగ్రహం
● పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్
● కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.16 కోట్ల విలువైన బిల్లులను తక్షణమే చెల్లించాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషనర్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించేంత వరకు నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టేది లేదని తెగేసి చెప్పారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. సమస్య పరిష్కరించకుంటే అనంతపురం నుంచి ఇచ్ఛాపురం వరకు పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ధర్నాకు రాష్ట్ర ఏపీ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్, డిప్యూటీ కో ఆర్డినేటర్ ఆర్.సాధూరావు సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. బిల్లుల చెల్లింపులో కమిషనర్ నియంతృత్వ విధానం విడనాడాలని, ట్రెడ్స్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదనంగా వసూలు చేస్తున్న ఈఎండీ వెంటనే చెల్లించాలన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు అశోక్, లింగరాజు, అధ్యక్ష, కార్యదర్శులు బంగార్రాజు, రాజ్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధి పోర్టర్ అప్ లోడ్‌పేరుతో మార్పు చేసి బకాయిలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. డబ్బులు ఉన్నాయని చెప్పి టెండర్లు పిలిచి, పనులు చేయించుకున్న తర్వాత పేమెంట్ చేసే విషయంలో మాకు సంబంధం లేదన్నట్టుగా అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. ధర్నాలో కాంట్రాక్టర్లు దువ్వి శ్రీనివాసరావు, మచ్చ సత్యనారాయణ, నరేంద్ర, శ్రీనివాసరాజు, సత్యనారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు.


