నిండా మునిగిన చెరకు రైతు
తుఫాన్ వర్షాలకు రేగిడి, సంతకవిటి మండలాల్లో చెరకు పంట నీటమునిగింది. తుఫాన్ వర్షాలు తగ్గిన ఈ ప్రాంతాల్లో పంటపొల్లాల్లో వరద నీరు తగ్గలేదు. ప్రధానంగా రేగిడి మండలంలో ఏకేఎల్ గెడ్డ పరిధిలో రేగిడి, ఆమదాలవలస, చిన్నయ్యపేట, తునివాడ, ఉంగరాడ తదితర గ్రామాల్లో 400 ఎకరాల్లో చెరకు పంట నీటమునిగింది. మరో నెలరోజుల్లో ఈ పంటను కోతచేసి సంకిలి వద్ద సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలి. పంట చేతికందిన సమయంలో నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరా సాగులో రూ.90 వేల మేర పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. సంతకవిటి మండలంలో సాయన్నచానల్ పరిధిలోని చెరకు పంటతో పాటు నాగావళి గర్భంలో ఉన్న చెరకు పంట నీటమునిగింది. ఈ మండలంలో జావాం, కేఆర్ పురం తదితర గ్రామాలు వద్ద 120 ఎకరాల్లో చెరకు పంటలో నీరుచేరి ప్రమాదకరంగా మారింది.


