గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు
● వేటకు మోంథా తుఫాన్ దెబ్బ
● ప్రతి కూలవాతావరణంతో కొనసాగని చేపల వేట
పూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు మోంధా తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన ప్రతి కూల వాతావరణంతో వేటసాగక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావం వల్ల వాతావరణ మార్పులతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేట సాగలేదు. గడిచిన నాలుగు రోజులుగా మత్స్యకారులకు చేపల వేట సాగలేదు. జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలలో 27 కిలో మీటర్ల తీరంలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 885 రిజిస్టర్డ్ బోట్లలో సుమారు 5 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంబించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో చేపలు వలకు చిక్కలేదని, అ తరువాత అల్పపీడనం రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా అలల ఉధృతితో ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు. వేట సాగక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల కుటుంబాలను విపత్తులు, తుఫాన్ హెచ్చరికల సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు


