మంత్రి ఇలాకాలో ఇన్‌చార్జిలే దిక్కు
దత్తిరాజేరు: సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలంలో పాలన ఇన్‌చార్జిలతో నడుస్తోంది. అసలే వర్షాలు పడుతుండడంతో సీజనల్ వ్యాధులు సోకే సమయంలో పంచాయతీ అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఇన్‌చార్జులే అయినా ఉన్న వారు కూడా పూర్తి స్థాయిలో విధుల్లో లేకపోవడంతో సర్పంచ్‌లు పారిశుధ్య పనులు చేసినా బిల్లులు అవుతాయో లేదోనన్న సందేహంతో కాలం వెల్లదీస్తున్నారు. అసలే వెనుకబడిన మండలంలో పాడి రైతులు ఎక్కువగా ఉన్న పెదమానాపురం, దత్తిరాజేరు పశు వైద్యకేంద్రాలకు కూడా పశువైద్యులు ఇన్‌చార్జులు కావడంతో వారు గజపతినగరం నుంచి ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి పాడిరైతులకు ఏర్పడింది. అత్యవసర సమయాల్లో పశువులకు వైద్యం చేయించుకోవడానికి చేతిచమురు వదిలించుకోవాల్సి వస్తోందని పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యయసాయ భూములు ఎక్కువగా ఉన్న మండలం కావడంతో తహసీల్దార్ కూడా ఇన్‌చార్జ్ కాగా పనులు జరుగుతాయో లేదోనన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. రెవెన్యూ కార్యాలయంలో ఉన్న డీటీ వరప్రసాద్ బాడంగి అదనపు తహసీల్దార్‌గా వెళ్లి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీటీ పోస్టు భర్తీ కాక ఆ కుర్చీ ఖాళీగానే ఉంది, విద్యార్థులతో పాటు మండల కార్యాలయాలకు వచ్చే వారికి పత్రికలతో పాటు మంచి పుస్తకాలు అందుబాటులో ఉండి అందరికీ ఉపయోగ పడుతుందని గత ప్రభుత్వంలో నిర్మించి మండల శాఖా గ్రంథాలయంలో అధికారి లేక పోవడంతో ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. దీంతో పాఠకులు కూడా అటు వైపు వెళ్లడం మానేశారు. సంబంధిత అదికారులు, పాలకులు దష్టిసారించి ఇన్‌చార్జ్‌ల స్దానంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు,


