కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
తెర్లాం: మండలంలోని జగన్నాథవలస గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామానికి చెందిన బొత్స అరుణ శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఇంటి వద్ద గిన్నెలు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణను భర్త, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజాంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించారు. అరుణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు దుర్మరణం
కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కవిటి నుంచి సోంపేట రోడ్డులో వెళుతుండగా జగతి గ్రామం మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోవడంతో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెల్లడయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. శివాజీ స్వగ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రవివర్మ తెలిపారు.
కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు


