మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
బొండపల్లి: మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బొండపల్లి మండలంలోని రోళ్లవాక గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన బెల్లాన సతీష్(32) బొండపల్లి మండలంలోని రోళ్లవాక గ్రామానికి చెందిన శాంతిని వివాహం చేసుకుని స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన సతీష్ నిత్యం మద్యం తాగుతూ పనికి వెళ్లకుండా డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఆదివారం ఉదయం కూడా మద్యం కోసం డబ్బులిమ్మని భార్యను వేధించడంతో ఆమె లేవని చెప్పగా మనస్తాపానికి గురై చంద్రంపేటలో పురుగు మందు తాగేసి అత్తవారి ఊరైన రోళ్లవాకకు వచ్చి గ్రామానికి సమీపంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి సుపత్రికి తరలించినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు.
ఉరేసుకుని మరొకరు..
కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల రాయల్‌సిటీ లేఅవుట్‌లో నివాసముంటున్న యల్లపు హేమావెంకట్(35) కడుపునొప్పి, కిడ్నీ సమస్యలు భరించలేక శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హేమావెంకట్ సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కాగా కొద్ది కాలంగా కడుపునొప్పి, కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి తోడు కాంట్రాక్ట్ పనుల్లో నష్టం రావడం, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి నెలవారీ చెల్లింపులు చేయకపోవడంతో మానసికంగా ఒత్తిడికి లోనై తన ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖ రావు తెలిపారు.


