టెట్ అర్హత జీవితకాలం చెల్లుబాటులో ఉండాలి : ఫ్యాప్టో
విజయనగరం అర్బన్: ఆర్‌టీఈ చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సర్టిఫికెట్‌కు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘జీవితకాల చెల్లుబాటు’ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు డీఆర్‌వో ఎస్.శ్రీనివాసమూర్తిని, డీఈవో యు.మాణిక్యంనాయుడుకు శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం 2011 నుంచి 2025 మధ్య నిర్వహించిన టెట్ పరీక్షలకు 7 సంవత్సరాల చెల్లుబాటు మాత్రమే ఉన్నట్టు పేర్కొనడం ఉపాధ్యాయులలో ఆందోళనకు దారి తీసిందని అన్నారు. 2011లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటుగా ఉండాలని స్పష్టం చేసినందును రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2009 ఆర్‌టీఈ చట్టం ప్రకారం దేశ వ్యాప్తంగా టెట్ పరీక్ష తప్పనిసరి చేసిన నేపథ్యంలో అర్హత పొందిన అభ్యర్థులు పునరావృత పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. డీఆర్‌వోను కలిసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ పి.శ్రీనివాసరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, ఎన్‌వీ పైడిరాజు, ఏలూరి శ్రీనివాసరావు, డి.శ్యాం, జేఆర్‌సీ పట్నాయక్, సూరిబాబు తదితరులు ఉన్నారు.


