కడపలో సీపీఐ లిబరేషన్ రాష్ట్ర మహాసభలు
విజయనగరం గంటస్తంభం: కడపలో డిసెంబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సీపీఐ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సభలకు సంబంధించిన పోస్టర్లను శనివారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ లిబరేషన్ జిల్లా కార్యదర్శి బి.శంకరరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న హిందుత్వ, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం, కార్పొరేట్ వర్గాలను బలోపేతం చేసే విధానాలపై సభల్లో చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపొందిస్తామన్నారు. కార్మిక, దళిత, మైనార్టీ, రైతు, పేదల పోరాటాలకు ముందుండే సమయం వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే కుట్రల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ కోతలతో పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో క్షీణత పెరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.గంగాధర్, ఎన్.సూర్యనారాయణ, ఎం.సురేష్, ఏఐసీసీటీయూ నాయకులు పాల్గొన్నారు.


