ప్రజలను అప్రమత్తం చేయండి
బలిజిపేట: మండలంలోని వంతరాం, నూకలవాడ గ్రామాల్లో వరద ఉధృతితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారిని అప్రమత్తం చేసి, సమస్యలు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. ఈ మేరకు మండలంలోని వంతరాం, నూకలవాడలో ఆయన బుధవారం పర్యటించారు. వంతరాంలో వేగావతి వరద ఉధృతి పెరిగి గ్రామంలోకి రావడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వేగావతి నది పక్కనే ఉన్న బస్టాండ్ రోడ్డును ఎత్తుచేయాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచించారు. వేసవిలో వేగావతి నది ఎండిపోవడంతో నీటి సమస్య వస్తోందని, అందుకు నది దాటి ఉండే రాతికొండ సమీపంలో చెక్‌డ్యాం నిర్మాణం చేపడితే నీరు నిల్వ ఉండి మోటార్లు పనిచేస్తాయని గ్రామస్తులు కోరగా దీనిపై పరిశీలించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వంతరాం కేజీబీవీని పర్యవేక్షించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వద్ద ఏఎన్‌ఎం ఆసమయంలో లేకపోవడంతో కలెక్టర్ ఆమైపె ఆగ్రహించారు. నూకలవాడలో పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించారు. గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తోందని గ్రామస్తులు తెలపడంతో విద్యుత్‌శాఖ ఏఈని కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ బాలమురళీకృష్ణ, ఎంపీడీఓ శ్రీవాణి, మండలస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి


