విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
వంగర: మండల పరిధిలోని కొండచాకరాపల్లి గ్రామంలో బెల్టుషాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీధికి రెండు చొప్పున గ్రామంలో ఆరు బెల్టు షాపుల ద్వారా విక్రయాలు అక్రమంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషమేమంటే మడ్డువలస ప్రాజెక్టుకు ఎగువ భాగంలో ఉన్న ఈ గ్రామాన్ని వరద నీరు ఎప్పుడు చుట్టుముడుతుందోనని అధికారులు రాత్రింబవళ్లు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రామ ప్రజలను ఉన్న బంగారువలస వద్దకు తరలించేందుకు పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇందు కోసం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ గ్రామంలో అధికారులు హడావుడిగా పర్యటనలు సాగిస్తుంటే బెల్టుషాపులు నిర్వహకులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొంతమంది ప్రజలు నిర్వాహకులపై మండిపడుతున్నారు. అధికారులు కూడా వారి విక్రయాలను చూసీ చూడనట్లు విడిచిపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


