ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలించాలి
విజయనగరం అర్బన్: ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ రవిసుభాష్ పట్టంశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. వృద్ధులు, పాతఇళ్లు, పాడు పడిన ఇళ్లల్లో ఉన్నవారిని పునరావాస శిబిరాలకు చేర్పాలన్నారు. తుఫాన్ చర్యలపై టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డితో కలిసి అధికారులతో మంగళవారం సమీక్షించారు. చెరువు గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలు వేయాలన్నారు.
నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు
జిల్లాలోని బొండపల్లి, గజపతినగరం మండలాలలోని కంట్రోల్ రూంలను కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మంగళవారం సందర్శించారు. కంట్రోల్ రూంలో విధుల కేటాయింపు, విధుల నిర్వహణలో అలసత్వం చూపుతున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బొండపల్లి, గజపతినగరం మండలాల తహసీల్దార్లు, ఆయా మండలాల ప్రత్యేక అధికారులైన పట్టు పరిశ్రమ సహాయ సంచాలకుడు, జిల్లా కోపరేటివ్ అధికారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు.


