పక్షవాతం పట్ల అప్రమత్తం
స్ట్రోక్ లక్షణాలు:
● ఒక్కసారిగా తలనిరుత్తత, నడవలేక పోవడం, తడబడడం
● ఒక్కసారిగా చూపు మసకబారడం
● ముఖం ఒక వైపు వంగిపోవడం, నవ్వలేక పోవడం
● ఒక చెయ్యి బలహీనంగా ఉండడం, లేవలేకపోవడం
● మాటలు అడ్డంగా రావడం, గందరగోళంగా మాట్లాడడం
విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలానికి చెందిన యువకుడు సంతోష్ ఉదయం ఇంట్లో మంచంపైనుంచి ఆకస్మాత్తుగా పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లి సి.టి స్కాన్ చేయగా పక్షవాతం(స్ట్రోక్)కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.
● మెంటాడ మండలానికి చెందిన స్వామి నాయుడు అనే 38 ఏళ్లు వ్యక్తికి మూతి వంకర పోయి, చేయి ఎత్తలేక పోవడంతో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి సి.టి స్కాన్ చేయగా పక్షవాతం బారిన పడినట్లు గుర్తించారు. సమాజంలో స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గతంలో 50, 60 ఏళ్లు దాటిన వారు స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. నేడు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
● స్ట్రోక్‌పై అవగాహన లేక చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల వ్యాధి తీవ్రమై మృత్యువాత పడతారు. వ్యాధి లక్షణాలు కనపించిన వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తే వైకల్యం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం వల్ల స్ట్రోక్ బారిన పడే ఆస్కారం ఉంది.
గతంలో 50 ఏళ్లుదాటిన వారికి స్ట్రోక్
ప్రస్తుతం స్ట్రోక్ బారిన 20, 30 ఏళ్ల యువత
బాధితులను సకాలంలో ఆస్పత్రిలో చేర్చాలి
జిల్లాలో ఏడాదికి 2 వేల నుంచి 3వేల మందికి స్ట్రోక్
పొగ, మద్యంతాగడం, ఊబకాయం, బీపీ, సుగర్ వ్యాధుల వల్ల స్ట్రోక్ వచ్చే ఆస్కారం
స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తలు
బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ చెక్ చేసుకుంటూ ఉండాలి
మందులు వాడడం మానకూడదు
మధుమేహాన్ని (షుగర్)ను నియంత్రణలో ఉంచుకోవాలి
ధూమపానం, మద్యం మానివేయాలి
పొగతాగడం రక్తనాళాలను దెబ్బతీస్తుంది
మద్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది
ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడవడం లేదా వ్యాయమం చేయాలి. దీనివల్ల మొదడు ఆరోగ్యంగా ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా, విశ్రాంతి ద్వారా ఒత్తిడిని జయించవచ్చు.
హృదయ సమస్యలను పట్టించుకోవాలి
స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి
స్ట్రోక్ రావడానికి కారణం:
మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్
పొగ, మద్యం తాగడం
తీవ్రమైన ఒత్తిడి, ఒబెసిటి, కాలుష్యం
గర్భనిరోధక మాత్రలు వాడడం
గుండెజబ్బులు
శారీరక శ్రమ లేక పోవడం


